ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలకు బలమైన సామాజిక సంబంధాలు అవసరం: వితంతువుల పై అధ్యయనం

Read time: 1 min
క్యాన్బెర్రా, ఆస్ట్రేలియా
18 ఫిబ్ర 2022
మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలకు బలమైన సామాజిక సంబంధాలు అవసరం: వితంతువుల పై అధ్యయనం

Image Credits: Ministry of Information & Broadcasting (GODL-India), GODL-India via Wikimedia Commons

ప్రస్తుతం భారతదేశం మొత్తం జనాభాలో 60 ఏళ్లు మరియు పైబడినవారు 6.4% ఉన్నారు. రానున్న 30 ఏళ్లలో ఈ సంఖ్య 13.8%కి పెరుగుతుందని అంచనా. కానీ కేరళ లో పరిస్థితి ఈ సంఖ్యల కు భిన్నంగా ఉంది. ఈ రాష్ట్రం లో కేవలం ఐదేళ్లలో 20% మంది 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటారు. రాష్ట్రంలోని వృద్ధుల జనాభాలో, స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు మరియు 57% మంది వృద్ధ స్త్రీలు వితంతువులు.

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విశ్వవిద్యాలయంలోని హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నేతృత్వంలోని ఒక పరిశోధన బృందం కేరళలో నివసిస్తున్న వృద్ధ వితంతువులకు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం ను ప్రభావితం చేసే విభిన్న అంశాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వారి పరిశోధనలు ఏజింగ్ & సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.

ప్రపంచ ధోరణి లో స్త్రీలు మగవారి కన్నా ఎక్కువ కాలం బ్రతకడం (వృధ్ధాప్య స్త్రీత్వ కల్పన) ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కు సవాల్ గా గుర్తించబడింది. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీనితో పాటు, వృద్ధ వితంతువులకు ఆర్థిక సవాళ్లు, సమాజ అపనిందలు, మరియు ఒంటరితనం ఎదురవుతాయి, ఈ కారణాలు వారి ఆరోగ్య సంరక్షణ ప్రాప్యతను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఆరోగ్య సంరక్షణ సేవలు వృద్ధ మహిళల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు.

ఈ అధ్యయనంలో, పరిశోధకులు కేరళలోని వృద్ధ వితంతువులు  ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడానికి ప్రభావితం చేసే అంశాలు పరిశోధించారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో వారు ఈ అధ్యయనం నిర్వహించారు. కొట్టాయం జిల్లాలో నివసిస్తున్న 20 లక్షల మందిలో 70% కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరియు, అక్కడ మొత్తం జనాభాలో దాదాపు 16% మంది 60 ఏళ్లు పైబడిన వారు. ఈ పరిశోధన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వృద్ధ వితంతువుల గృహాలు మరియు వృద్ధ వితంతువులు పనిచేసే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ప్రదేశాలలో నిర్వహించబడింది.

దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న (Above Poverty Line, APL) విభాగంలోని వితంతువులను పరిశోధకులు ఇంటర్వ్యూ చేయగా, వారు కుటుంబ మరియు పెన్షన్ పథకాలు వారి ప్రాథమిక ఆర్థిక మూలాలు గా గుర్తించారు. ఇంకా, పరిశోధకులు రాష్ట్ర ప్రభుత్వ వితంతు పింఛను పథకం మరియు MGNREGA పని ద్వారా పొందిన ఆదాయంపై ఆధారపడిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (Below Poverty Line, BPL) వర్గంలోని మహిళలను కూడా ఇంటర్వ్యూ చేశారు. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు మరియు బలహీనమైన వినికిడి/కంటి చూపు ఈ మహిళలు  ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యలు గా గుర్తించారు.

ఒంటరితనం ఈ స్త్రీలు ఎదుర్కొంటున్న ఒక ప్రముఖ సమస్యగా ఉద్భవించింది. వారిలో చాలా మంది పెద్ద ఉమ్మడి కుటుంబంలో  ఉండేవారు మరియు వారి చిన్న వయసులో వారి తల్లిదండ్రులనూ, తాతలనూ చూసుకుంటూ ఉండేవారు. కానీ, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం యువ తరాల వలస పెరగడం మరియు చిన్న కుటుంబ నిర్మాణాలకు సాధారణ పరివర్తన కారణంగా అదే స్త్రీలు తమ ఇళ్లలో ఒంటరిగా మిగిలిపోయారు. చాలా మందికి పిల్లలు, మనుమలు లేరు, వారికి సంరక్షణ లేదా తోడు అందించడానికి.

కావున ఒంటరితనం చాలా మంది స్త్రీలలో నిరాశ మరియు వ్యాకులత కు దారి తీస్తుంది. పర్యవసానం, అనారోగ్యం తీవ్రమైన, నిర్వహించలేని దశకు చేరుకునే వరకు ఆసుపత్రులకు వెళ్లడానికి లేదా వారి రోగాలకు చికిత్స పొందేందుకు వారి ప్రేరణ ను తగ్గించడం వంటి హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది.

హెల్త్‌కేర్ వర్కర్లకు ఈ సమస్య గురించి తెలిసినప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కేరళలోని వృద్ధుల కోసం ఇటువంటి మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అమర్చబడలేదు లేదా రూపొందించబడలేదు. సంస్థాగత సంరక్షణ గృహాలలో ప్రవేశం సాధ్యమయ్యే పరిష్కారమే అయినప్పటికీ, చాలా మంది మహిళలు తమ సొంత ఇళ్లలో నివసించాలని మరియు తమ జీవితాల్లో స్వాతంత్రం మరియు నియంత్రణ కొనసాగించాలనే బలమైన కోరిక వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాలలో, వృద్ధ మహిళలు తరచుగా వివిధ సామాజిక నెట్‌వర్క్‌లలో భాగంగా ఉంటారు, అవి వారి ఒంటరితనం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి మరియు ఆరోగ్య సంరక్షణ సేవలు పొందే ఆస్కారాలను బలోపేతం చేస్తాయి. ఈ సామజిక నెట్‌వర్క్‌లలో ఇరుగు-పొరుగు, మతపరమైన సమ్మేళనాలు, MGNREGA పని స్థలాల సభ్యులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఇమిడి ఉన్నారు.
ఇరుగుపొరుగు వారు ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్ళినా మరియు మందులు కొనడానికి వారికి సహాయం చేసినా లేదా మహిళలు వేడుకల్లో పాల్గొనడంవలన సహాయం చేసినా, ఈ నెట్‌వర్క్‌లు వృద్ధ వితంతువులకు ఆరోగ్య సంరక్షణ మరియు మెరుగైన శ్రేయస్సును సమర్థవంతంగా అందించాయని ఆరోగ్య కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.

వృద్ధ వితంతువులు వారి పెన్షన్ మరియు MGNREGA వేతనం పొందే వరకు దుకాణదారులు వడ్డీ చెల్లింపు ఆలస్యం చేయడానికి అనుమతించడం వంటి సంఘీభావ చర్యలు పరిశోధకులు గమనించారు. ఈ చర్యలు, ఎక్కువ సహకారం అందించకపోయినా, ఈ సంఘీభావ భావం మరియు సామాజిక నెట్‌వర్క్‌ల ఉనికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది.

అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోని వికేంద్రీకృత పంచాయతీ రాజ్ వ్యవస్థలో స్థానిక ప్రాంతాల్లో వృద్ధుల సంఖ్య సమాచారం మరియు రికార్డులు ఉంటాయి. కారణంగా, ASHA (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు) మరియు ఇతర సామజిక హెల్త్‌కేర్ వర్కర్లు వృద్ధ వితంతువులను గుర్తించడం మరియు సహాయం అందివ్వడం సులభం అవుతుంది.

మరోవైపు పట్టణ ప్రాంతాల్లోని వృద్ధ వితంతువుల సమాచార కొరవ ఉంది. అపార్ట్‌మెంట్‌లు గట్టి భద్రతా వ్యవస్థలను కలిగి ఉండడం వలన, ASHAలు మరియు ప్రజారోగ్య వ్యవస్థ కార్యకర్తలు వృద్ధ వితంతువులను చేరుకోవడానికి అడ్డంకవుతాయి. అదనంగా, అపార్ట్‌మెంట్‌లు సాధారణంగా దూరంగా విసిరేసినట్టు  ఉంటాయి, పైగా వృద్ధ మహిళలు మరియు వారి పొరుగువారి మధ్య తక్కువ పరస్పర చర్య ఉంటుంది.

కావున, పట్టణ ప్రాంతాల్లోని వృద్ధ వితంతువులకు సామాజిక నెట్‌వర్క్‌లు ఏర్పడే ఆస్కారం మరియు వారికి మద్దతు ఇవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. అందువల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని వితంతువుల కంటే నగరాల్లోని వృద్ధ వితంతువులు మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, వారు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

"ఆర్థిక స్థితి సాధారణంగా భేద్యత కి గుర్తుగా పరిగణించబడుతుంది. అయితే, ఇది తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి కంటే సామాజిక సంబంధాలు మరియు నెట్‌వర్క్‌లు చాలా ముఖ్యమైనవని మేము కనుగొన్నాము,”అని అధ్యయనం యొక్క ప్రధాన రచయిత శ్రీ సునీల్ జార్జ్ చెప్పారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సామజిక నెట్‌వర్క్‌లు అధిక ఆరోగ్య సంరక్షణ సౌలభ్య సంబంధం కలిగి ఉన్నట్లు వారు కనుగొన్నారు.

భారతదేశంలోని వృద్ధ వితంతువులు వివాహిత మహిళల కంటే ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మరియు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలు తక్కువ కలిగి ఉండడం వల్ల, వితంతువుల  పరిస్థితి  దుర్బలంగా ఉంటుంది. ఈ అధ్యయనం మానసిక ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలను సుగమం చేయడానికి ఇతర అడ్డంకులకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.

బలమైన సామాజిక నెట్‌వర్క్‌లు వృద్ధ వితంతువులకు అండగా పనిచేస్తాయి, అవి ఒంటరితనం వల్ల కలిగే సవాళ్ళను ఆర్థిక బలం కూడా సహాయపడలేని విధంగా పరిష్కరిస్తాయి. 

పరిష్కార మార్గాల గురించి  అడిగినప్పుడు, శ్రీ జార్జ్ ఇలా అన్నారు, "వృద్ధులకు వారి కోసం సామాజిక నెట్‌వర్క్‌లను ప్రోత్సహించే సామాజిక రక్షణ విధానాన్ని అభివృద్ధి చేయడం చాలా అవసరం."

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామాజిక సంస్థలు, స్థానిక క్లబ్‌లు, మత- ఆధారిత సమూహాలు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పట్టణ ప్రాంతాలలో ఒంటరిగా ఉన్న వృద్ధ వితంతువులకు ఆసరా అందించవచ్చు అని ఆయన చెప్పారు. సాంస్కృతికంగా సున్నితమైన మరియు వికేంద్రీకృత వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అవసరం, ఇది పట్టణ కేంద్రాల్లోని వార్డు స్థాయిలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉప-కేంద్రాల స్థాయిలో అందించవచ్చు. వృద్ధ వితంతువులకు మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్ సేవలను అందించడం కూడా వారి జీవితాలను మెరుగుపరచడంలో కీలకమైన దశ అవుతుంది.