ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

ఏనుగు తోక వెంట్రుకలు వాటి ఒత్తిడి కథలు తెలియజేయగలవు

క్యోటో, జపాన్
14 జన 2022
ఏనుగు తోక వెంట్రుకలు వాటి ఒత్తిడి కథలు తెలియజేయగలవు

చిత్ర క్రెడిట్: ఏనుగు చిత్రం Pixabay; ఇన్ సెట్ గ్రాఫిక్, సవిత శేఖర్, రీసెర్చ్ మ్యాటర్స్

అడవి ఆసియా ఏనుగులు (ఎలిఫాస్ మాగ్జిమస్) సామాజిక జంతువులు. ఆడ ఏనుగులు మందలలో నివసిస్తూ,  మాతృస్వామి నాయకత్వంలో మేతమేస్తూ కలిసి తిరుగుతాయి. మగ ఏనుగులు, ఒంటరిగా కానీ చిన్న సమూహాలలో కానీ తిరుగుతాయి. మగ ఏనుగులు సంభోగ సమయంలో ఆడ ఏనుగులతో కలిసి, తర్వాత వెళ్లిపోతాయి.

బంధించబడిన ఏనుగులు, వాటి అడవి ప్రత్యర్ధుల వలె కాకుండా, చిన్న ప్రదేశాలకు పరిమితం అయి ఉంటాయి. ఈ ఏనుగులకు ఆహారం, నీరు, మరియు ఆరోగ్య పర్యవేక్షణ సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి సామూహిక జీవనాన్ని కోల్పోయి సామాజిక ఒంటరితనానికి గురి అవుతాయి. ఇది వారి శ్రేయస్సును  దెబ్బతీయవచ్చు. ఈ బందీ ఏనుగులు ఒత్తిడికి గురవుతాయా? అలా అయితే, మనం దానిని ఎలా తెలుసుకోవచ్చు?

పరిశోధకులు వాటి తోక వెంట్రుకలు పరిశీలించి వాటి ఒత్తిడి స్థాయిని తెలుసుకోగలుగుతున్నారు, తెలుసా?

ఏనుగులు మరియు ఇతర క్షీరదాలలో తోక వెంట్రుకలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా ఇమ్యునో రియాక్టివ్ కార్టిసాల్ అని పిలువబడే ఒత్తిడి హార్మోన్ల జాడలు కూడా కలిగి ఉంటాయి. ఇటీవల సహకార అధ్యయనంలో, భారతదేశం మరియు జపాన్ పరిశోధకులు బంధింపబడిన ఆసియా ఏనుగు తోక వెంట్రుకల లో ఒత్తిడి హార్మోన్లు సేకరించబడతాయి అని  చూపించారు. పీర్‌ జె జర్నల్‌ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, ఆసియాలోని పెద్ద క్షీరదాలలో తోక వెంట్రుకలను ఒత్తిడి సూచికగా ఉపయోగించిన మొదటి అధ్యయనం. మరియు, బంధీ ఏనుగులు ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించడానికి  తోక వెంట్రుకలు ప్రభావవంతమైన సాధనం అని సూచిస్తుంది.

ఇంతకు మునుపు, ఆసియా ఏనుగుల తోక వెంట్రుకలు పరీక్షించి, వాటి ఆహార చరిత్ర, వలస విధానాలు మరియు కాలక్రమాన్ని విశ్లేషణ చేయబడ్డాయి. జంతువులలో ఒత్తిడిని పర్యవేక్షించిన మునుపటి అధ్యయనాలు మలం, మూత్రం మరియు రక్త నమూనాలను ఉపయోగించాయి. ఇది అమోదబడే పద్ధతి అయినప్పటికీ వాటిలో ఒక లోపం ఉంది. "మలంలో జీవక్రియలు, రక్తం మరియు మూత్రంలోని హార్మోన్‌లను ఉపయోగించి ఒత్తిడిని కొలవడం వలన అదే రోజు లేదా మునుపటి 12 నుండి 36 గంటల వరకు ఒత్తిడి స్థాయిలు మనకు తెలుస్తాయి. జుట్టుతో, మేము ఇంతటి మునుపు ఒత్తిడి స్థాయిలను గుర్తించగలము”, అని అధ్యయనం యొక్క మొదటి రచయిత డాక్టర్ సంజీతా శర్మ పోఖరెల్ చెప్పారు.

జుట్టు నమూనాలను ఉపయోగించడం వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తం సంగ్రహించే టప్పుడు, జంతువుకు బాధ కలిగి వారు ఒత్తిడికి గురి కావచ్చు. కానీ, వెంట్రుకలు సేకరించడం తక్కువ అసౌకర్యం కలిగిస్తుంది. అదనంగా, పరిశోధకులు శరీర జుట్టు కంటే తోక వెంట్రుకలను సంగ్రహించడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది మందంగా మరియు పొడవుగా ఉంటాయి. "ఏనుగు యొక్క శరీర జుట్టు థర్మో-రెగ్యులేషన్ (శరీర తాప నిర్వహణ)  కోసం ఉపయోగించబడుతుంది, అయితే తోక అత్యంత నమ్యంగా ఉంటుంది, ఎక్టోపరాసైట్స్ (ఈగలు మరియు పేలు వంటివి) ను చర్మం నుండి దూరంగా ఉంచడానికి పనిచేస్తుంది. అందుకే తోక లో మందపాటి జుట్టు ఉంటుంది," అని డాక్టర్ పోఖరెల్ వివరించారు.

పరిశోధకులు తమ ప్రయోగాలు జపాన్ లోని క్యోటో సిటీ మరియు కోబే ఓజి జంతుప్రదర్శనశాల లోని ఆరు ఆసియా ఏనుగులపై నిర్వహించారు. మొదట, వారు ఏనుగు తోక వెంట్రుకల పెరుగుదల క్రమాన్ని కొలిచారు. తదుపరి, వారు ఏనుగు తోక వెంట్రుకల నమూనాలను చర్మానికి దగ్గరగా ఉన్న కొన్ని వెంట్రుకల తంతువులు కత్తిరించడం ద్వారా సేకరించారు. ఈ ప్రక్రియలో ఏనుగుల చర్మానికి లేదా వెంట్రుకల కుదుళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నారు. నమూనా సేకరణ ప్రక్రియలో పరిశోధకులు జంతు నైతిక హక్కులు ఉల్లంఘించకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు వారు సేకరించిన జుట్టు తంతువుల నుండి కార్టిసాల్ హార్మోన్లను సేకరించారు.

జుట్టు పెరుగుదల క్రమం ఆరు ఏనుగుల లో భిన్నంగా ఉండటం వారు గమనించారు. అయినప్పటికీ,  ప్రతి  ఏనుగులో వెంట్రుకల పెరుగుదల క్రమం కాలక్రమేణా ఒకే విధంగా ఉండటం గమనించారు. పరిశోధకులు ప్రతి ఏనుగు యొక్క రోజువారీ జుట్టు పెరుగుదల ను కూడా లెక్కించారు; దీని ఆధారంగా సేకరించిన జుట్టు తంతువులను ఒత్తిడి విశ్లేషణ కోసం నెల వారీగా విభజించారు.

"పొడవైన మరియు వేగంగా పెరుగుతున్న జుట్టు ఉన్న జంతువుల లో, సుదీర్ఘ కాల ఒత్తిడి స్థాయి జాడ తెలియజేసాయి. ఉదాహరణకు, ఒక ఏనుగు లో, మేము గత మూడు సంవత్సరాల వరకు కలిగిన ఒత్తిడి స్థాయిలను గుర్తించగలిగాము,” అని డాక్టర్ పోఖరెల్ వివరించారు.

ప్రతి ఏనుగు కోసం, వారు ఏనుగు యొక్క మునుపటి ఆరోగ్య రికార్డు మరియు జూ కీపర్ నిర్వహించిన ఇతర జీవసంబంధమైన సంఘటనలను ఒత్తిడి హార్మోన్లు నమూనాలతో ఒక కాల వ్యవధిలో పోల్చారు.

అంటువ్యాధులు, గాయాలు, రక్తహీనత మరియు నోటి పుండ్లు వంటి రోగలక్షణ ఒత్తిళ్ల రికార్డులు వారు సేకరించారు; ఆవరణలోకి ప్రవేశించడానికి అయిష్టత వంటి మానసిక ఒత్తిళ్లు, మరియు పునరుత్పత్తి ఒత్తిళ్లు అధిక కార్టిసాల్ స్థాయిలను సూచించాయి. అదే సమయంలో, ఇతర ఏనుగులతో సామాజిక పరస్పర చర్యలు, ఆవరణ మరియు జీవన పరిస్థితుల అనుకూలత ఉన్న సందర్భాలలో ఉపశమనం కలిగి, ఆ ఏనుగుల లో  కార్టిసాల్ స్థాయిలను తగ్గటాన్ని పరిశోధకులు గమనించారు.

ఈ గమనికలతో, ఒత్తిడి స్థాయిలను అధ్యయనం చేయడానికి మరియు ఏనుగులపై పూర్వ సంఘటనల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి తోక వెంట్రుకలను ఇప్పుడు ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అదనంగా, చనిపోయిన ఏనుగుల  జుట్టు తంతువులలోని కార్టిసాల్ స్థాయిలను విశ్లేషించడం వలన వారి జీవన పరిస్థితులపై అంతర్దృష్టులను అందించవచ్చు మరియు విస్తృత పర్యావరణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు అని వారు చెప్పారు.

"ఉదాహరణకు, కరువు, అగ్ని లేదా వ్యాధి వ్యాప్తి సంభవించిన సమయాలలో జుట్టు విభాగాలలో కార్టిసాల్ గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు మేము కనుగొంటే, జంతువుపై గత సంఘటనలు మరియు వాటి ప్రభావాలను మనం ఊహించవచ్చు" అని డాక్టర్ పోఖరెల్ వివరించారు.

పరిశోధకులు మరి కొన్ని ఏనుగుల పై తదుపరి అధ్యయనాలు, విభిన్న వెలికితీత మరియు విశ్లేషణాత్మక సాంకేతికతతో ప్రయోగాలు చేయడం ద్వారా మెరుగైన అంతర్దృష్టులను అందించవచ్చని సూచించారు.

మలం, మూత్రం మరియు రక్త నమూనాల శ్రేణిలో కార్టిసాల్ స్థాయిలను అధ్యయనం చేసి మరియు వాటిని ఏనుగు తోక వెంట్రుకల  నమూనా డేటా తో పోల్చడం వలన బందీగా ఉన్న ఆసియా ఏనుగులలో హెయిర్ శాంపిల్స్‌ను స్ట్రెస్ ఎనలైజర్‌గా ఉపయోగించ వచ్చని వారు భావిస్తున్నారు.

"మేము ఇప్పుడు ఇతర జంతుప్రదర్శనశాలల తో సహకరించి, అన్య మాత్రికల ద్వారా కార్టిసాల్ స్థాయిలను తనిఖీ చేయాలని  అనుకుంటున్నాము. మరియు అందువల్ల, ఏనుగుల వివిధ రకాల శారీరక ప్రశ్నలు పరిష్కరించడానికి ఈ అధ్యయనాన్ని  ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము," అని డాక్టర్ పోఖరేల్ సంకేతాలు ఇచ్చారు.


సంపాదకుని గమనిక: ఈ కథనం లో చిన్న లోపాలు సవరించబడినాయి