ప్లాస్టిక్లు మొండి చెత్త; అవి జీవఅధోకరణం (biodegrade) చెందవు. అయినప్పటికీ, మన విచక్షణారహిత మయిన ప్లాస్టిక్ వాడకం వలన అవి ఇప్పుడు మన మహాసముద్రాల్లో కూడా విస్తరించాయి, తెలుసా?
ఐక్యరాజ్యసమితి ప్రకారం, 80% సముద్ర కాలుష్యం భూమి ఆధారిత వ్యర్ధ పదార్ధాలు మరియు చెత్త వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా, మన జలమార్గాలు టన్నుల కొద్దీ విసిరేసిన ప్లాస్టిక్లు మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి తీసుకువెళతాయి. అంతే కాకుండా, ఓడలు మరియు చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకును, చేపల వలలు మరియు ఇతర వ్యర్థాలను సముద్రంలోకి పడేస్తాయి.
'గైర్స్' అని పిలువబడే బలమైన సముద్రపు ప్రవాహాలు ఈ చెత్తను చాలా దూరంగా సముద్రం మధ్యలోకి తీసుకువెళతాయి. సుడి లాంటి గైర్ కరెంట్లు ఆ వ్యర్థాలను తిప్పుతూ, వాటిని సుడిగుండంలోకి లాగుతాయి. తత్ఫలితంగా, దాదాపు 70% చెత్త సముద్రగర్భంలో మునిగిపోయి, దిగువన భారీ చెత్త సుడి లాగ తయారవుతుంది.
మరోవైపు, ఫోటో-డిగ్రేడేషన్ (సూర్యకాంతి కారణంగా విచ్ఛిన్నం) మరియు బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్న చిన్న ముక్కలు (మైక్రోప్లాస్టిక్) గా విడిపోతాయి. ఫలితంగా, మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్‌లు సముద్రాలలో చుట్టూ తేలుతూ, నీళ్లను మబ్బు మయం చేస్తున్నాయి. కొన్ని ముక్కలు దట్టమైన చెత్తలో కలిసిపోయి అనేక వందల అడుగుల పొడవు ఉండే ఘన శాశ్వత ద్వీపం లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తున్నాయి.
ఇలా పేరుకుపోతున్న సముద్ర శిధిలాలు 'గ్రేట్ మెరైన్ గార్బేజ్ ప్యాచ్‌లు' గా పిలువబడుతున్నాయి. మన మహాసముద్రాల్లో ఐదు గైర్లు ఉన్నాయి మరియు అన్నింటిలో చెత్త ప్యాచ్ లు పెరుగుతున్నాయి. వీటిలో గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అతిపెద్దది.
చెత్త ప్యాచ్ లు సముద్ర పర్యావరణ వ్యవస్థ యొక్క సున్నితమైన సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. డీప్-సీ డైవర్లు (సముద్ర లోతులకి డైవ్ చేసేవారు) అనేక అరుదైన మరియు విజాతి సముద్ర జంతువులు పారవేసిన చేప వలల్లో (ఘోస్ట్ ఫిషింగ్ నెట్స్) చిక్కుకుని చనిపోయి పడియుండుట గమనించారు.
అదనంగా, అనేక సముద్ర జంతువులు తెలియక, మైక్రోప్లాస్టిక్‌లను ఆహారంగా భావించి తినేస్తున్నాయి. పైగా వాటి పిల్లలకి కూడా తినిపిస్తున్నాయి. పర్యవసానంగా, ఆ ప్లాస్టిక్ ముక్కలను అరగించుకోలేక చివరికి ఆకలితో లేదా దెబ్బతిన్న అవయవాలు వల్ల చనిపోతున్నాయి.
అలాగే, గైర్లు ప్యాచ్ లను సముద్రంలో చాలా దూరం తీసుకువెళతాయి. బహుశా, ఆక్రమణ జంతు జాతులను ఇతర పర్యావరణ వ్యవస్థలలో రవాణా చేస్తాయి. తద్వారా సున్నితమైన పర్యావరణ సహజ సమతుల్యత కు భంగం కలుగుతుంది. అంతేకాకుండా, చెత్త ప్యాచ్ లు సూర్యరశ్మిని ప్లాంక్టన్ మరియు ఆల్గే (నీటి పాచి) లకు చేరుకోకుండా అడ్డుకుంటాయి - ఇవి మహాసముద్రాలలో ప్రాథమిక ఉత్పత్తిదారులు - దానివలన వాటి మనుగడకు ముప్పు ఉంటుంది. ప్లాంక్టన్ మరియు ఆల్గే నశించిపోతే, మొత్తం ఆహార గొలుసు అలలుగా ప్రభావాలను ఎదుర్కొంటుంది.
సముద్రంలో చెత్తాచెదారం చేరుకోలేని ప్రాంతాల్లో ఏర్పడి ఉండటం వలన వాటిని తోడి వేయడం లేదా శుభ్రం చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరియు ఆ పద్ధతులు ఆర్థికంగా కూడా లాభదాయకం కాదు అని చెబుతున్నారు. పైగా, ప్లాస్టిక్ ముక్కలు తోడటం వలన నీటిలో ఉన్న లక్షలాది జీవులకు జీవ ప్రమాదం జరగవచ్చు. ప్రస్తుతం, ప్యాచ్‌లు పెరగకుండా నిరోధించటానికి ఒకటే మార్గం: సముద్రాల్లో చేరే చెత్తను భారీగా తగ్గించడం మాత్రమే.