ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

కప్పల కి ప్రియమైన తినుబండారాల పట్టిక ఉంది: వాటి పొట్టలో పదార్థాలు వరి పంట తెగుళ్లను ఎలా నివారిస్తాయో తెలుపుతున్నాయి

Read time: 1 min
బెంగళూరు
11 ఫిబ్ర 2022
కప్పల కి  ప్రియమైన తినుబండారాల పట్టిక ఉంది: వాటి పొట్టలో  పదార్థాలు వరి పంట తెగుళ్లను ఎలా నివారిస్తాయో తెలుపుతున్నాయి

Microhyla ornata

వరి మరియు ఇతర పొలాల్లో కప్పలు విరివిగా కనిపిస్తూ ఉంటాయి.  అవి సాధారణంగా పంటలకు హాని కలిగించే పచ్చ దోమ (లీఫ్ హాపర్) లాంటి కీటకాలను తిని మంచి జీవ నియంత్రణ కారకాలు గా పని చేస్తూ ఉంటాయి. ఈ కీటకాలు మొక్కల సారన్ని పీల్చి శక్తిని తగ్గించడమే కాకుండా,  వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు మరియు ఇతర రోగాణువులకు సాధనంగా (వాహకాలుగా ) కూడా పనిచేస్తాయి.

ఇప్పుడు బెంగుళూరులోని అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ATREE), మరియు సెంటర్ ఫర్ ఎకోలాజికల్ స్టడీస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు పరిశోధకుల బృందం వరి పొలాల్లో కప్పలను సర్వే చేసి వాటి ఆహారాన్ని విశ్లేషించింది. 

వారు రెండు కప్ప జాతుల కడుపు లోని పదార్థాలను పరీక్షించి, వివరణాత్మక విశ్లేషణ చేసి, కీటకాల నుండి పంటలను రక్షించడంలో కప్పలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రుజువు  చేశారు. విచక్షణారహితంగా పురుగు మందుల వాడకం ద్వారా కొన్ని కీటక జాతులు నాశనం అవటంవల్ల,  కప్పల ఆహార ఎంపిక పరిమితం అవుతుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయం, జీవవైవిధ్యాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది: ఒకటి, భూమిని ఆక్రమించి విస్తరించడం మరియు రెండవది, ఎరువులు మరియు రసాయనాల వాడకం వలన భూమి కాలుష్యాన్ని ముమ్మరం చేయడం.  వరి పొలాల్లో పురుగు మందులు, కలుపు సంహారకాలు మరియు ఎరువుల వంటి వ్యవసాయ రసాయనాలు చల్లుతారు. ఈ రసాయనాలు కప్పల ప్రధాన ఆహారం అయిన కీటకాల జనాభాను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. 

కప్పలు పంట పర్యావరణ వ్యవస్థలలో ఒక ముఖ్యమైన భాగం, ఎందుకంటే అవి పంట తెగుళ్లు గా ఉండే అనేక కీటకాలను కూడా తింటాయి. అయినా, కప్ప జాతులు మరియు వాటి జనాభా ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తూ ఉన్నందున వారి భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. వాటి ఆవాసాలు నష్టం మరియు వ్యవసాయ రసాయనాల వాడకం కప్పల సంఖ్య క్షీణతకు దోహదపడుతున్న రెండు ప్రధాన సమస్యలు.

వరి పొలాల్లో కప్పల సాంద్రత మరియు వాటి ఆహారం గురించి అధ్యయనం చేయడానికి, పరిశోధకులు వరి పొలాలను సర్వే చేసి, కప్పలను సేకరించారు. సర్వే చేసిన 60 వరి పొలాల్లో ఆరు జాతులకు చెందిన 1705 కప్పలు కనిపించాయి. ఆ ఆరు జాతులలో, మినర్వర్య కాపెరాటా మరియు మైక్రోహైలా ఒర్నాటా అనే రెండు సాధారణ కప్ప జాతుల కడుపులో ఉన్న పదార్థాలను పరిశీలించారు. ఈ రెండింటిలో కడుపు పదార్థాలు వెలికితీస్తే, 261 కీటకాలు బయట పడ్డాయి. ఆప్పుడు పరిశోధకులు ఆ కీటకాలను వర్గీకరించారు.

"ఈ రెండు జాతుల కప్పలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు, చాలా భిన్నమైన ఆహారాన్ని తింటాయి," అని డాక్టర్ శేషాద్రి చెప్పారు.

మినర్వర్య కాపెరాటా పేడ పురుగులు, లార్వా మరియు సాలెపురుగులు వంటి విభిన్న కీటకాలను తినడం ఇష్టపడుతుంది. మరోవైపు మైక్రోహైలా ఒర్నాటా ఎక్కువగా కందిరీగలు, చీమలు మరియు చెదపురుగు లకు చెందిన కీటకాల తరగతికి ప్రాధాన్యతనిస్తుంది. అనేక లార్వా/గొంగళి పురుగులు, కందిరీగలు మరియు పేడ పురుగు వరి పంటలను నాశనం చేస్తాయి. పరిశోధకులు ఈ కప్పల కడుపులో కొన్ని మొక్కల పదార్థాలు మరియు గులకరాళ్ళను కూడా కనుగొన్నారు. ఈ గులకరాళ్లు కీటకాల ఎముక చిప్ప ని జీర్ణం చేయడానికి కప్పలకు సహాయపడతాయని వారు భావించారు.

"మా అధ్యయనం వరి పొలాల్లో కప్పల ఆహారాన్ని పరిశీలించిన మొదటి అధ్యయనం మరియు ఇది చాలా ప్రశ్నలకు దారితీస్తుంది. ఉదాహరణకు, పురుగు మందులు వాడని  వ్యవసాయ ప్రాంతాల్లో కప్పలు ఎక్కువ వైవిధ్యభరితమైన ఆహారం తీసుకుంటాయా? ” అని డాక్టర్ శేషాద్రి అన్నారు.

కప్పలు కొన్ని కీటకాలను ఎంచుకుని వేటాడమే కాకుండా వాటి పైన  భిన్నమైన వేట వ్యూహాలు కూడా పన్నవచ్చు. మినర్వర్య కాపెరటా నేపథ్యంతో కలిసిపోయే రూపం (camouflage) మరియు రంగును కలిగి ఉండి, ఆహారం తన తరఫుకి కదలి వచ్చే వరకూ వేచి ఉండటానికి ఇష్టపడుతుంది, అయితే మైక్రోహైలా ఒర్నాటా ఎక్కువగా కీటకాలను వెతికి వేటాడుతుంది.

ఈ పరిశోధనతో కప్పల కి వాస్తవానికి నిర్దిష్టమైన అహార ఎంపికలు ఉన్నయని బయటపడింది. పరిశోధకులు కప్పలపై పురుగు మందుల ప్రభావం మరియు ఆహార ప్రాప్యతపై మరింత కఠినమైన అధ్యయనం అవసరం అని  అన్నారు.

ఇంతకు ముందు చెప్పినట్లు అనేక కీటకాలు పంటలను నేరుగా నాశనం చేయడమే కాకుండా పంటలకు హాని కలిగించే వైరస్‌లు మరియు బ్యాక్టీరియాల వాహకాలుగా కూడా పనిచేస్తాయి. ఇతర కీటకాల వలె, పంట తెగుళ్ళ కీటకాల లో పురుగుమందులకు నిరోధకతను పెంచవచ్చు, అయితే ఈ కీటకాలు కప్పలు వంటి  జీవ నియంత్రణ సాధకాల (బయో కంట్రోల్ ఏజెంట్ ) నుండి తప్పించుకోవడం కష్టం. కప్పలు తెగుళ్ళకు దారితీసే కీటకాలను తింటాయి  కాబట్టి వాస్తవానికి పురుగు మందుల వాడకం మరియు దుర్వినియోగం యొక్క ద్రవ్య మరియు పర్యావరణ వ్యయాన్ని భర్తీ చేయవచ్చు.

కావున, పంట తెగుళ్లు నియంత్రించటానికి, పర్యావరణపరంగా హానికరమైన క్రిమిసంహారకాలను వాడటమా లేదా మన ఆహార గొలుసు ద్వారా సహజంగా రూపొందించబడిన బయోకంట్రోల్ ఏజెంట్‌ని ఎంచుకోవడమా  అనే ఎంపికను మన ముందు ఉంచుతుంది.